సుప్రీం కోర్టుకు చేరిన ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల వివాదం.. ఆ కోణంలో దర్యాప్తు చేయాలన్న పిటిషనర్

by Vinod kumar |
సుప్రీం కోర్టుకు చేరిన ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల వివాదం.. ఆ కోణంలో దర్యాప్తు చేయాలన్న పిటిషనర్
X

న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌, డీఎంకే ఎంపీ రాజా చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. డీఎంకే నేతలు సనాతన ధర్మంపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని కోరుతూ చెన్నైకు చెందిన లాయర్ బి. జగన్నాథ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఉదయనిధి, రాజాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని, వాటిని నిలువరించాలని కోరారు. హిందూధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్లకు బయట నుంచి ఏమైనా నిధులు వస్తున్నాయా అనే కోణంలోనూ విచారణ జరపాలని పిటిషనర్ కోరారు.

ఉగ్రవాద సంస్థలతో డీఎంకే నేతలకు సంబంధాలు ఉన్నాయేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని సుప్రీంకోర్టును కోరారు. ఉదయనిధి, రాజాల వ్యాఖ్యలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక నోడల్ ఆఫీసరును నియమించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తమిళనాడు డీజీపీకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఈ పిటిషన్‌‌ను విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌‌ను పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించి సీజేఐ చంద్రచూడ్.. ప్రొసీజర్ ప్రకారమే పిటిషన్‌ల విచారణ చేపడతామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story