Data Protection Bill: డేటా దుర్వినియోగానికి పాల్పడితే.. రూ.250 కోట్ల జరిమానా..

by Vinod kumar |
Data Protection Bill: డేటా దుర్వినియోగానికి పాల్పడితే.. రూ.250 కోట్ల జరిమానా..
X

న్యూఢిల్లీ: డిజిటల్ డేటా వినియోగదారులను దుర్వినియోగం చేయడం లేదా రక్షించడంలో విఫలమైన వ్యక్తులకు, సంస్థలకు రూ.250 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ మేరకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2023ను గురువారం పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. డిజిటల్ డేటా రక్షణ కోసం డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

గతేడాది నవంబర్‌లో ప్రజల సంప్రదింపుల కోసం పంపిణీ చేసిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనతో పోలిస్తే ఈ బిల్లులో పెనాల్టీ నిబంధనలను సడలించింది. చట్టం నిబంధనలను ఒక వ్యక్తి లేదా సంస్థ ఉల్లంఘించినట్లు విచారణ తర్వాత బోర్డు నిర్ధారిస్తే చట్టంలో పేర్కొన్న జరిమానా విధించే అధికారం లభిస్తుంది.

నిబంధనలను ఉల్లంఘించే సంస్థపై గరిష్టంగా రూ.250 కోట్లు, కనిష్టంగా రూ.50 కోట్ల జరిమానా విధించవచ్చు. చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, బోర్డు, దాని చైర్‌పర్సన్, దానిలోని ఏ సభ్యుడు, అధికారి లేదా ఉద్యోగిపై ఎలాంటి దావా, ప్రాసిక్యూషన్ లేదా ఇతర చట్టపరమైన చర్యలు ఉండవు.

పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత బిల్లు పౌరులందరి హక్కులను పరిరక్షిస్తుందని, జాతీయ భద్రత, మహ్మమ్మారి, భూకంపాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం సహాయం చేసేందుకు ఈ డేటా వీలు కల్పిస్తుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

Advertisement

Next Story