నితీశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. 65% రిజర్వేషన్లను రద్దు చేసిన కోర్టు

by Harish |
నితీశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. 65% రిజర్వేషన్లను రద్దు చేసిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్‌లో నితీశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులు(బీసీ), షెడ్యూల్డ్ కులాలు(ఎస్‌సీ), షెడ్యూల్డ్ తెగ(ఎస్‌టీ)లకు ఉన్నటువంటి రిజర్వేషన్లను 50 నుండి 65 శాతానికి పెంచుతూ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గురువారం పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు కుల ఆధారిత సర్వే చేపట్టిన నితీష్ ప్రభుత్వం దాని ఆధారంగా గతేడాది నవంబర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అణగారిన వర్గాలకు కోటాను పెంచింది. బీహార్ అసెంబ్లీ 2023లో రిజర్వేషన్ సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో 50 శాతంగా ఉన్న రిజర్వేషన్లు 65 శాతానికి చేరాయి.

సవరించిన రిజర్వేషన్ కోటాలో షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 2 శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు 43 శాతం ఉన్నాయి. అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ఉన్న 10 శాతం కోటాను కలిపితే బిల్లు ప్రకారం రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. దీంతో ఇది సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్‌ను అధిగమించిందని కొంతమంది విమర్శలు చేశారు.

ఈ క్రమంలో రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ, గౌరవ్ కుమార్, ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మార్చి 11, 2024న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ గురువారం పెంచిన రిజర్వేషన్లు కొట్టి వేస్తూ ప్రధాన న్యాయమూర్తి కె వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా దీనిపై స్పందిస్తూ, పాట్నా హైకోర్టు 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం దురదృష్టకరమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed