Parimal Dey: కోల్‌కతా లైంగిక దాడి ఘటనపై నిరసన.. ‘బంగా రత్న’ అవార్డు తిరిగిచ్చిన బెంగాల్ రచయిత

by vinod kumar |
Parimal Dey: కోల్‌కతా లైంగిక దాడి ఘటనపై నిరసన.. ‘బంగా రత్న’ అవార్డు తిరిగిచ్చిన బెంగాల్ రచయిత
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్యకు ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తనకు అందించిన ప్రతిష్టాత్మక ‘బంగా రత్న’ అవార్డును తిరిగి ఇవ్వాలని ప్రముఖ బెంగాలీ రచయిత పరిమల్ డే నిర్ణయించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రం మొత్తం విషపూరితమైనట్టు కనిపిస్తోంది. ఇటీవల లైంగిక దాడి ఘటనపై సీఎం మమతా చేసిన వ్యాఖ్యలు చాలా నిరుత్సాహపరిచాయి. అయినప్పటికీ సమస్యాత్మక రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నా. ఘోరమైన నేరానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి’ అని పేర్కొన్నారు.

బంగా రత్న అవార్డును తిరిగి ఇవ్వాలనే తన నిర్ణయం రాజకీయ ప్రేరేపితమైంది కాదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ రాజీనామా కోరడం లేదని తెలిపారు. కేవలం ఘటనపై తీవ్ర విచారాన్ని మాత్రమే వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరాశ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అలీపుర్‌దువార్‌కు చెందిన పండితుడు, విద్యావేత్త అయిన పరిమల్ డే 2016లో గాంధేయ తత్వశాస్త్రంలో చేసిన విస్తృత కృషికి గానే రాష్ట్ర ప్రభుత్వం ‘బంగా రత్న’ అవార్డుతో సత్కరించింది.

Advertisement

Next Story

Most Viewed