పాలస్తీనా పిటిషన్‌ను పున:పరిశీలించాలి: ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్

by samatah |
పాలస్తీనా పిటిషన్‌ను పున:పరిశీలించాలి: ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేసిన దరఖాస్తు పున:పరిశీలించబడుతుందని ఆశిస్తున్నట్టు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పష్టం చేశారు. పాలస్తీనా ప్రయత్నానికి పూర్తి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు. యూఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశంలో రుచిరా ప్రసంగించారు. ‘వివాదం పరిష్కారమైనప్పుడే పాలస్తీనా ప్రజలు సురక్షితమైన సరిహద్దుల్లో స్వతంత్ర దేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతారు. ఇజ్రాయెల్ భద్రతా అవసరాలకు అనుగుణంగా శాశ్వత పరిష్కారం కోసం ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు జరగాలి. వీటిని పునఃప్రారంభించేందుకు అనుకూలమైన పరిస్థితులను పెంపొందించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

యూఎన్ఓలో సభ్యత్వం పొందాలనే పాలస్తీనా ప్రయత్నానికి ఆమోదం లభిస్తుందని తెలిపారు. గాజాలో పెద్ద ఎత్తున పౌర, ప్రాణనష్టం, మానవతా సంక్షోభం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ‘గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రదాడులు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఉగ్రవాదం, బందీలుగా చేసుకోవడం వంటి చర్యలకు ఎటువంటి మద్దతు ఉండదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎప్పటి నుంచో పోరాడుతోంది. బందీలను తక్షణమే షరతులు లేకుండా విడుదల చేయాలి’ అని తెలిపారు. గాజాకు మానవతా సాయాన్ని పెంచాలని కోరారు.

కాగా, గత నెలలో పాలస్తీనాకు ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను భద్రతా మండలిలో తీర్మానించగా అమెరికా వీటో పవర్ ద్వారా అడ్డుకుంది. ఈ తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయి. స్విట్జర్లాండ్, బ్రిటన్‌లు గైర్హాజరయ్యాయి. అమెరికా వీటో చేయడంతో తీర్మానం వీగి పోయింది. ఈ నేపథ్యంలోనే పాలస్తీనా పిటిషన్‌ను పున:పరిశీలించాలని భారత్ కోరుతోంది.

Advertisement

Next Story

Most Viewed