'నిజ్జర్ హత్యలో పాక్ ఐఎస్ఐ హస్తం?'.. జాతీయ మీడియాలో సంచలన కథనాలు

by Vinod kumar |
నిజ్జర్ హత్యలో పాక్ ఐఎస్ఐ హస్తం?.. జాతీయ మీడియాలో సంచలన కథనాలు
X

న్యూఢిల్లీ : కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందని భారత నిఘా వర్గాలు చెప్పాయంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. భారత్‌-కెనడా మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకే ఐఎస్‌ఐ నిజ్జర్‌ను అంతమొందించి ఉంటుందని నిఘా వర్గాలు తెలిపాయని పేర్కొన్నాయి.

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ నిజ్జర్‌కు కెనడాలో ఉంటున్న పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లతో ముందు నుంచే సంబంధాలున్నాయి. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్‌స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఐఎస్‌ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్‌పై ఒత్తిడి పెంచిందని, దానికి నిరాకరించడంతో ఈ ఏడాది జూన్‌లో హత్య చేయించిందని భారత మీడియా కథనాల్లో ప్రస్తావించారు.

బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్‌ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ తలపై రూ.10లక్షల రివార్డు ఉంది. కాగా, నిజ్జర్ హత్య వెనుక భారత్ కు చెందిన రా ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed