Sitharaman: మోడీ 3.0పై అపోహలు తొలగిపోయాయి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

by vinod kumar |
Sitharaman: మోడీ 3.0పై అపోహలు తొలగిపోయాయి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ 3.0 ప్రభుత్వం బలహీనంగా ఉందన్న అపోహను హర్యానా ఎన్నికల ఫలితాలు తొలగించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫైనాన్షియల్ టైమ్స్ బుధవారం నిర్వహించిన ‘ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ ఇండియా’ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అయితే 2024 తర్వాత ఒకే బడ్జెట్ సెషన్ జరిగిందని, పలు క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వంపై వ్యతిరేకతలేదని అర్థమైందన్నారు. హర్యానా ఫలితాలే అందుకు నిదర్శనమని నొక్కి చెప్పారు. దేశాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడంలో ప్రధాని మోడీ ముందు నుంచి నాయకత్వం వహించారని కొనియాడారు.

ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం కాప్ 21లో ఇచ్చిన హామీలను భారత్ తన సొంత వనరులతో ముందుగానే నెరవేర్చిందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ డీకార్బనైజేషన్‌పై, గ్రీన్ ఎనర్జీతో కూడిన 13 సన్‌రైజ్ సెక్టార్‌ల కోసం ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. అలాగే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. కాగా, హర్యానా ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story