Smita Sabharwal : కొత్త బాధ్యతల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌

by Y. Venkata Narasimha Reddy |
Smita Sabharwal : కొత్త బాధ్యతల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌
X

దిశ, వెబ్ డెస్క్ : నిన్నటి వరకు మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌ రాష్ట్రానికి చేరుకున్న వెంటనే కొత్త బాధ్యతల్లో చేరిపోయారు. తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్ ను ఇటీవల పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన సందర్భంగా రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతి శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెకు ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టింగ్ ఇచ్చినప్పటికి మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా వెళ్లడంతో తిరిగి వచ్చాక తన కొత్త బాధ్యతలు చేపట్టారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో స్మితా సబర్వాల్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుల్దానా, మల్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్షన్ జనరల్ అబ్జార్వర్‌గా నియమించింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే తనకు అప్పగించిన కొత్త బాధ్యతలు చేపట్టారు. స్మితా సబర్వాల్ భర్త ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.

2001లో ట్రైనీ కలెక్టర్‌గా విధుల్లో చేరిన స్మితా సబర్వాల్ ఉమ్మడి ఏపీలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. మిషన్ భగీరథ ముఖ్య కార్యదర్శిగానూ పని చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. తాజాగా.. అక్కడి నుంచి కూడా బదిలీ చేసి రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా కొత్త బాధ్యతలు అప్పగించారు. స్మితా సబర్వాల్ విధి నిర్వాహణలో తన పనితీరుతోనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు సామాజిక అంశాలపై డెరైక్టుగా, రాజకీయ అంశాలపై పరోక్షంగా స్పందిస్తుండగా..అంతే స్థాయిలో ఆమె తరుచే వార్తల్లో నిలుస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed