చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. పాక్‌పై భారత్ ఫైర్.. ఉగ్రవాదుల హత్యలతో కలకలం

by Hajipasha |   ( Updated:2024-01-25 18:53:42.0  )
చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. పాక్‌పై భారత్ ఫైర్.. ఉగ్రవాదుల హత్యలతో కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో : షాహిద్ లతీఫ్, రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం అనే ఇద్దరు పాకిస్తానీ టెర్రరిస్టుల హత్యలో భారత గూఢచార ఏజెంట్ల ప్రమేయం ఉందన్న పాకిస్తాన్ ఆరోపణను భారత్ ఖండించింది. దురుద్దేశంతో భారత్ వ్యతిరేక ప్రచారానికి పాక్ తెగబడిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆరోపించారు. ‘‘పాకిస్తాన్ ఏదైతే విత్తుతోందో.. అదే కోస్తోంది’’ అని ఘాటుగా విమర్శించారు. ‘‘భారత్‌‌పై పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ముహమ్మద్ సైరస్ సజ్జాద్ ఖాజీ చేసిన ఆరోపణల వివరాలతో ప్రచురితమైన మీడియా నివేదికలను మేం చూశాం. ఇది తప్పుడు ప్రచారం. పాకిస్తాన్ తీవ్రవాదానికి, వ్యవస్థీకృత నేరాలకు, చట్టవిరుద్ధమైన అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా మారిన విషయం యావత్ ప్రపంచానికి తెలుసు’’ అని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ‘‘ఉగ్రవాదాన్ని అంతం చేయాలని యావత్ ప్రపంచ దేశాలు పాక్‌ను కోరుతూనే ఉన్నాయి. అయినా అది మారడం లేదు. పాకిస్తాన్ ఏదైతే విత్తుతోందో అదే కోస్తోంది. దాని సొంత దుశ్చర్యలకు ఇతరులను నిందించడం పరిష్కారం కాదు’’ అని హితవు పలికారు. 2016లో భారత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి సూత్రధారిగా వ్యవహరించిన ఉగ్రవాది షాహిద్ లతీఫ్ 2023 అక్టోబర్ 11న సియాల్‌కోట్‌లోని మసీదులో హత్యకు గురయ్యాడు. 2023 జనవరి 1న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ధంగ్రీ ఉగ్రదాడి సూత్రధారులలో ఒకరైన రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిం రావాలకోట్‌లోని మసీదులో నెల క్రితమే మర్డర్ ‌కు గురయ్యాడు. ఈ రెండు హత్యల వెనుక భారత రా ఏజెంట్లు ఉన్నారని పాక్ ఆరోపిస్తోంది. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత గూఢచారుల ప్రమేయం ఉందని కెనడా సర్కారు ఆరోపిస్తోంది. ఇక తమదేశంలో ఉంటున్న ఖలిస్తాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత గూఢచారులు కుట్రపన్నారని ఇటీవల అమెరికా కూడా ఆరోపించింది.

Advertisement

Next Story