Pak accidents: పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం.. రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 40 మంది మృతి

by vinod kumar |
Pak accidents: పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం.. రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 40 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 40 మంది మృతి చెందారు. 30 మంది ప్రయాణికులతో కూడిన బస్సు హవేలీ కహుటా నుంచి రావల్పిండికి వెళ్తుండగా తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లోని కహుటా జిల్లాలోని పానా బ్రిడ్జి సమీపంలో కాలువలో పడింది. ఈ ఘటనలో 29 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటన బలూచిస్థాన్ ప్రావీన్సులో జరిగింది. 70 మంది ప్రయాణికులతో కూడిన బస్సు ఇరాన్ నుంచి పంజాబ్ ప్రావీన్సుకు వెళ్తుండగా అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా..32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది లాహోర్, గుజ్రాన్‌వాలాకు చెందిన వారేనని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, పాకిస్థాన్‌లో బస్సు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇటీవల ఇరాక్‌కు వెళ్తుండగా ఇరాన్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 35 మంది పాక్ యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ప్రమాదాలపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. అలాగే ప్రధాని షెహబాజ్ షరీఫ్ విషాద ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story