No Tobacco: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించాలంటున్న 92 శాతం మంది

by S Gopi |
No Tobacco: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించాలంటున్న 92 శాతం మంది
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో పొగాకు సంబంధిత మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించాలని కోరుతున్నారు. 'పొగాకు రహిత భారత్ ' పేరుతో నిర్వహించిన ఓ సర్వేలో 92 శాతం మంది దేశీయ పౌరులు విమానాశ్రయాలు, విలాసవంతమైన రెస్టారెంట్లతో సహా బహిరంగ ప్రదేశాలను పూర్తిగా స్మోక్-ఫ్రీగా మార్చాలని కోరుతున్నారు. పొగ రహిత బహిరంగ ప్రదేశాలు, ఇతరులకు కలిగే ప్రమాదాల గురించి నిర్వహించిన ఈ సర్వేలో పలు కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, విమానాశ్రయాలు వంటి ప్రదేశాల్లో హానికరమైన పొగాకు కారణంగా మహిళలు, పిల్లలను రక్షించేందుకు కఠినమైన నిబంధలు ఉండాలని సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు. ట్విటర్‌లో 65,282 మంది పాల్గొన్న ఈ సర్వేలో 97 శాతం మంది రైల్వే స్టేషన్‌ల మాదిరిగానే విమానాశ్రయాలను కూడా పూరిగా స్మోక్-ఫ్రీ చేయాలన్నారు.

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో రుమటాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఉమా కుమార్ మాట్లాడుతూ, 'సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించినప్పటికీ, అది ఇప్పటికీ కొన్నిచోట్ల ధూమపానానికి అనుమతులున్నాయి. విమానాశ్రయాలలో విడిగా స్మోక్ రూమ్, 30 లేదా అంతకంటే ఎక్కువ గదులు ఉన్న హోటళ్లు, 30 కంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న రెస్టారెంట్‌లలో అనుమతులున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థ్తితులు ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్నాయి. ముఖ్యంగా పొగ తాగే వారి వల్ల ఇతరులకు సులభంగా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉందని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి. ధూమపానం చేయనివారు వాటి బారిన పడితే హానికరమైన టాక్సిన్స్‌కు గురవుతారు. ఇతర వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని ఉమా కుమార్ తెలిపారు. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్మోకింగ్ జోన్‌లను తొలగించేందుకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003కి సవరణలను ప్రతిపాదించింది. తాజా సర్వే ద్వారా ఇందుకు ప్రజల మద్దతు కూడా లభిస్తుందని తేలింది.

Advertisement

Next Story