వారిని మాత్రమే వెనక్కి తీసుకుంటాం: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్

by vinod kumar |
వారిని మాత్రమే వెనక్కి తీసుకుంటాం: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తిరుగుబాటుతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ) సత్తా చాటడంతో అజిత్ శిబిరంలోని పలువురు ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ వర్గంలో చేరుతున్నట్టు కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి రావడానికి తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపారు. అయితే పార్టీ ప్రతిష్టను దెబ్బతీయని ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకుంటామని, పార్టీ నాయకులు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే డెసిషన్ ఉంటుందని తెలిపారు. మంగళవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. అజిత్ పవార్‌ను మాత్రం తిరిగి ఎన్సీపీలోకి ఆహ్వానించేది లేదని స్పష్టం చేశారు.

ఎన్సీపీని బలహీనపర్చాలనుకునే వారిని పార్టీలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. ద్రోహం చేసిన నాయకులను లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తిప్పి కొట్టారని అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తర్వాత అజిత్ పవార్ వర్గంలోని 18 నుంచి 19 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని ఎన్సీపీ-ఎస్పీ నేత రోహిత్ పవార్ ఇటీవలే తెలిపారు. దీంతో శరద్ పవార్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కాగా, 2023జూలైలో అజిత్ పవార్, పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీ చీలిపోయింది. అనంతరం అజిత్ పవార్ వర్గాన్ని ఎన్నికల సంఘం నిజమైన ఎన్సీపీగా గుర్తించి గడియారం గుర్తును కేటాయించింది. శరద్ పవార్ వర్గం ఎన్సీపీ(ఎస్పీ)గా గుర్తింపునిచ్చింది.

Advertisement

Next Story