Online Passport Portal: దేశవ్యాప్తంగా ఆన్ లైన్ పాస్ పోర్టు సేవలకు అంతరాయం

by Shamantha N |   ( Updated:2024-08-29 07:46:18.0  )
Online Passport Portal: దేశవ్యాప్తంగా ఆన్ లైన్ పాస్ పోర్టు సేవలకు అంతరాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ పాస్‌పోర్టు సేవలకు అంతరాయం కలగనుంది. ఆన్‌లైన్ పోర్టల్‌ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపివేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ వ్యవధిలో కొత్త అపాయింట్‌మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదని, అలాగే ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌లు రీషెడ్యూల్ అవుతాయని పేర్కొంది. గురువారం రాత్రి నుంచి ఐదు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం వెల్లడించింది. ‘సాంకేతిక నిర్వహణ సంబంధిత కార్యకలాపాల దృష్ట్యా పాస్‌పోర్టు సేవా పోర్టల్ సేవలు గురువారం రాత్రి 8 గంటల (ఆగస్టు 29) నుంచి సోమవారం ఉదయం 6 గంటల(సెప్టెబర్ 2) వరకు అందుబాటులో ఉండవు. ఆగస్టు 30కి చేసుకున్న అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్ అవుతాయి. దీనికి సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకున్న వారికి అందిస్తాం’ అని పాస్‌పోర్టు సేవా పోర్టల్‌ సోషల్ మీడియాలో పేర్కొంది.

విదేశాంగ శాఖ ఏమందంటే?

పాస్ పోర్టు సేవల అంతరాయంపై విదేశాంగశాఖ స్పందించింది. ఇది సాధారణ ప్రక్రియే అని తెలిపింది. అపాయింట్‌మెంట్‌ల రీషెడ్యూల్ కోసం ఎల్లప్పుడూ ప్రణాళికలను కలిగి ఉంటామంది. పబ్లిక్ సెంట్రిక్ సర్వీస్ (పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వంటివి) నిర్వహణ కార్యకలాపాలు ఎల్లప్పుడూ ముందుస్తుగానే ప్లాన్ చేస్తామని పేర్కొంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామని వెల్లడించింది. ఈ పాస్‌పోర్టు సేవా పోర్టల్ ద్వారా కొత్త పాస్‌సోర్టులు లేక పాతవాటిలో మార్పుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో అపాయింట్‌మెంట్లు బుక్‌ చేసుకుంటారు. అపాయింట్‌మెంట్‌ రోజు పాస్‌పోర్టు కేంద్రానికి దరఖాస్తుదారుడు వెళ్లాలి. అక్కడ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఆ తర్వాత పోలీసు వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత అది దరఖాస్తుదారుడు పొందుపరిచిన చిరునామాకు చేరుతుంది. పాస్‌పోర్టును వేగంగా పొందేందుకు తత్కాల్ విధానమూ అందుబాటులో ఉంది.

Advertisement

Next Story

Most Viewed