సీఏఏ, జమిలి ఎన్నికలు రద్దు.. మేనిఫెస్టోలో డీఎంకే సంచలన హామీలు

by Hajipasha |   ( Updated:2024-03-20 14:26:58.0  )
సీఏఏ, జమిలి ఎన్నికలు రద్దు.. మేనిఫెస్టోలో డీఎంకే సంచలన హామీలు
X

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో సంచలన హామీలు ఇచ్చింది. తమిళనాడుకు తిరిగొచ్చే శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చింది. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ విధానం, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లను రద్దు చేస్తామని డీఎంకే వాగ్దానం చేసింది. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరిధి నుంచి తమిళనాడును తొలగిస్తామని ప్రతిజ్ఞ చేసింది. చెన్నైలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తూత్తుకుడి ఎంపీ కనిమొళి సహా డీఎంకే సీనియర్ నాయకులు కలిసి డీఎంకే మేనిఫెస్టోను విడుదల చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ భాషను రుద్దేలా ఉన్న జాతీయ విద్యా విధానాన్ని పునస్సమీక్షిస్తామని డీఎంకే వెల్లడించింది. ‘‘మాది పీపుల్స్‌ మేనిఫెస్టో. మేం రాష్ట్రమంతా వెళ్లి ప్రజల మాటలు విన్నాక దీన్ని తయారు చేశాం. బీజేపీ భారతదేశాన్ని నాశనం చేసింది. ఇచ్చిన మాటపై నిలబడే తత్వం బీజేపీకి లేదు’’ అని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ఆరుసార్లు తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోడీ.. వరదల టైంలోనూ రాష్ట్రానికి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించే వాడిని’’ అని విమర్శించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తమ హామీలన్నీ అమల్లోకి వస్తాయని డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. తూత్తుకుడి స్థానం నుంచి తనను తిరిగి పోటీకి నిలబెట్టినందుకు డీఎంకేకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తమిళనాడులో తాము పోటీ చేయనున్న 21 స్థానాలకు బుధవారం ఉదయం డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. ఈ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్ 19న ఒకే విడతలో జరగనుంది.

Advertisement

Next Story