మరోసారి కొవిడ్ కలకలం..వారం రోజుల్లోనే 25,900 కేసులు నమోదు

by samatah |
మరోసారి కొవిడ్ కలకలం..వారం రోజుల్లోనే 25,900 కేసులు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా సింగపూర్‌లో వారం రోజుల్లోనే భారీగా కేసులు నమోదయ్యాయి. మే 5 నుంచి 11 వరకు 25,900 కి పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం పౌరులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అలాగే కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్‌ సూచించారు. కొవిడ్ ప్రారంభ దశలో ఉన్నామని రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇది రాబోయే రెండు నుంచి నాలుగు వారాల్లో గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.

సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. మే 5 నుంచి 11 వరకు 25,900 కేసులు రాగా.. అంతకుముందు వారంలో 13,700 కేసులు నమోదయ్యాయి. గత వారం కంటే ప్రస్తుతం 90శాతం కేసులు పెరగడం గమనార్హం. అలాగే కొవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య వారం ముందు 181 ఉండగా.. అది ప్రస్తుతం 250కి పెరిగింది. అంతేగాక ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని ఓంగ్ యే కుంగ్‌ వెల్లడించారు. దానికి తగినట్టుగా ఆస్పత్రుల్లో సదుపాయాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు.

కేసుల పెరుగుదల నేపథ్యంలో అత్యవసరం కాని కేసులను ఆస్పత్రుల్లో లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. రోగులను ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే చికిత్స అందించే విధానాన్ని కూడా సింగపూర్ ఆరోగ్య శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు, వైద్యపరంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు, తీవ్రమైన వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు కొవిడ్-19 వ్యాక్సిన్ అదనపు డోస్‌ను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం సింగపూర్‌లో కేపీ1, కేపీ2 వేరియంట్ కేసులే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇవి ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని తెలుస్తోంది. కాగా, 2019 డిసెంబర్‌లో చైనాలో వెలుగుచూసిన కొవిడ్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed