పార్లమెంట్‌లో రెండో రోజు మణిపూర్ రచ్చ కంటిన్యూ

by Anjali |   ( Updated:2023-07-21 08:11:23.0  )
పార్లమెంట్‌లో రెండో రోజు మణిపూర్ రచ్చ కంటిన్యూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్ అల్లర్ల ఘటన పార్లమెంట్‌ను దింపేస్తున్నది. మణిపూర్ అంశంపై ముందుగా చర్చకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు నిరసనకు దిగాయి. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నచ్చజేప్పే ప్రయత్నం చేసినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. తక్షణమే చర్చతో పాటు దీనిపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని పట్టుబట్టాయి. దీంతో రెండో రోజూ పార్లమెంట్ దద్దరిల్లింది. విపక్షాల నిరసనలతో లోక్ సభను స్పీకర్ ఓం బిర్లా సోమవారానికి వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం బయటకు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌ అంశంపై చర్చపై ప్రతిపక్షాలు సీరియస్‌గా లేవని భావిస్తున్నాను.

మణిపూర్‌ అంశంపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. అయినా ప్రతిపక్షాలు చర్చకు రాకుంటే మాత్రం సీరియస్‌గా లేవనే భావనతో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల తీరుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ సమస్య చాలా సున్నితమైన అంశం. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దీనిని రాజకీయం చేయవద్దని నేను ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నానన్నారు.

రాజ్యసభ లోనూ..

మరోవైపు రాజ్యసభలోనూ మణిపూర్ అంశంపై విపక్షాలు ఆందోళన చేశాయి. ఈ అంశంపై చర్చ చేపట్టాలని పలువురు ఎంపీలో రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనతో రాజ్యసభను చైర్మన్ మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed