మోడీజీ.. గవర్నర్‌ లైంగిక వేధింపులపై స్పందించరా ? : దీదీ

by Hajipasha |
మోడీజీ.. గవర్నర్‌ లైంగిక వేధింపులపై స్పందించరా ? : దీదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీపై బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. బెంగాల్ రాజ్‌భవన్ మహిళా ఉద్యోగిపై గవర్నర్ సీవీ ఆనందబోస్‌ రెండుసార్లు అత్యాచారానికి తెగబడ్డారని ఆరోపణలు వస్తున్నా.. ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గురువారం రోజు ప్రధాని మోడీ బెంగాల్ పర్యటన సమయంలోనే బాధిత యువతి మీడియా ముందుకొచ్చి గవర్నర్ వేధించిన తీరును బయటపెట్టిందని గుర్తు చేశారు. అయినా దాని గురించి ఒక్క పదం కూడా ప్రధాని మోడీ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు రాగానే గొంతుచించుకొని అరిచి గగ్గోలు పెట్టిన ప్రధాని మోడీ.. ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలోని మహిళల ఆత్మగౌరవం గురించి ఉపన్యాసాలిచ్చే ప్రధానమంత్రి, బీజేపీ నేతలు.. రాజకీయ ప్రయోజనమున్న సందర్భాల్లోనే ఇలాంటి అంశాలపై మాట్లాడుతుండటం బాధాకరమన్నారు. రాష్ట్ర గవర్నర్ వల్ల దగాపడిన బాధిత యువతి గోడు విని తనకు కన్నీళ్లు ఉబికి వచ్చాయని దీదీ చెప్పారు. రాజ్‌భవన్‌లో పనిచేయాలంటే తనకు భయమేస్తోందని బాధిత యువతి చెప్పడం తనను ఎంతో కలచివేసిందన్నారు. కాగా, బెంగాల్ రాజ్‌భవన్ మహిళా ఉద్యోగి ఆరోపణలను గవర్నర్ సీవీ ఆనందబోస్‌ ఖండించారు. తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పారు. మున్ముందు ఇంకా ఎలాంటి ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story