ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే శివసేన నేత దారుణ హత్య.. తుపాకీతో కాల్చిచంపి.. ఆ తర్వాత

by Swamyn |
ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే శివసేన నేత దారుణ హత్య.. తుపాకీతో కాల్చిచంపి.. ఆ తర్వాత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ జరుగుతుండగానే శివసేన(యూబీటీ) నేత హత్యకు గురవడం మహారాష్ట్రలో కలకలంగా మారింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఉద్ధవ్ వర్గం శివసేన నేత, మాజీ కార్పొరేటర్ వినోద్ ఘోసల్కార్ కొడుకు అభిషేక్.. దహిసర్ ప్రాంతంలోని నిందితుడు మౌరిస్ నొరొన్హా అలియాస్ మౌరిస్ భాయ్ కార్యాలయంలో గురువారం ఫేస్‌‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగానే మౌరిస్ నొరొన్హా తుపాకీ తీసి అభిషేక్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం అతనూ కాల్చుకుని చనిపోయాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తనను తాను సామాజిక కార్యకర్తగా చెప్పుకునే మౌరిస్.. వెస్ట్ బోరివలిలో నివాసముంటాడని, రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అభిషేక్, మౌరిస్ కార్యాలయాలు పక్కపక్కనే ఉన్నాయని వెల్లడించారు. వీరు ఉండే ఏరియాపై రాజకీయంగా పట్టు కోసం ఇరువురి మధ్య ఇటీవల కొంత భిన్నాభిప్రాయాలు వచ్చాయని, ఆ తర్వాత కలిసిపోయారని చెప్పారు. ఈ క్రమంలోనే అభిషేక్‌ను ఓ ఈవెంట్ కోసం మౌరిస్ తన కార్యాలయానికి పిలిచాడని, ఇద్దరూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగానే మౌరిన్ కాల్పులకు పాల్పడ్డాడని తెలిపారు. అయితే, కాల్పులు జరపడానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.

‘సీఎం రాజీనామా చేయాలి’

ఈ ఘటనపై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు. ‘‘మహారాష్ట్రలో గూండాల పాలన నడుస్తోంది. అభిషేక్‌ను కాల్చిన మౌరిస్ నాలుగు రోజుల కిందటే సీఎం షిండేను కలిశాడు. తమ పార్టీలో చేరాల్సిందిగా మౌరిస్‌ను షిండే ఆహ్వానించారు. హోంమంత్రిగా ఫడ్నవీస్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇద్దరూ రాజీనామా చేయాలి’’ అంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.


Advertisement

Next Story