Jammu Kashmir: జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

by Shamantha N |
Jammu Kashmir: జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వం కొలువుదీరింది. సుమారు ఆరేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(NC) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (SKICC)లో ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా చేత కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు. ఒమర్ తో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత కనిమొళి, ఆప్ నేత సంజయ్ సింగ్ లు హాజరయ్యారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా హాజరయ్యారు.

కూటమి గెలుపు

ఇకపోతే, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించాయి. ఎన్నికల సమయంలో ఎన్సీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి మొత్తం 90 స్థానాల్లో పోటీచేసి 48 చోట్ల గెలిచాయి. అయితే, ఎన్సీ 42 సీట్లు గెలవగా, కాంగ్రెస్ 06 సీట్లు వచ్చాయి. దీంతో, అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభాపక్ష నేతగా ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా.. ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ ఎన్‌సీతోపాటు కాంగ్రెస్‌ నుంచి ఎల్‌జీకి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో బుధవారం కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణస్వీకారానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం జరిగింది

బయట నుంచే కాంగ్రెస్ మద్దతు

ఇదిలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో 42 సీట్లు గెలిచిన ఎన్సీకి ఇండిపెండెంట్లు, ఆప్ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అవసరం లేకుండానే ఎన్సీ మెజారిటీ మార్క్ 46ని దాటింది. అయితే, ఎన్సీ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కి ఒక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ ఆఫర్ ను కాంగ్రెస్ తిరస్కరించింది. మంత్రి పదవికి బదులుగా బయట నుంచి మద్దతు అందిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హోదాపై ఎన్సీ చర్చలు జరుపుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఇక, జమ్ముకశ్మీర్‌లో చివరిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ, పీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో జూన్ 19, 2018లో పీడీపీకి బీజేపీ మద్దతుని ఉపసంహరించుకుంది. ఆ తర్వాత జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించారు. దీని తర్వాత ఏడాదికి ఆర్టికల్ 370 రద్దు చేశారు. ప్రత్యేక హోదా రద్దు అయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఎన్సీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్సీ తర్వాత 29 ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Advertisement

Next Story

Most Viewed