ఓం బిర్లా vs సురేశ్..స్పీకర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ!

by vinod kumar |
ఓం బిర్లా vs సురేశ్..స్పీకర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ!
X

దిశ, నేషనల్ బ్యూరో:18వ లోక్ సభ స్పీకర్ ఎన్నికపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 50ఏళ్ల తర్వాత ఆ పదవికి ఎన్నిక జరగబోతోంది. ఈ పదవి కోసం ఎన్డీయే తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా, ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కోడికున్నిల్ సురేశ్‌లు నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార, ప్రతిపక్షం మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇండియా కూటమి స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో ఎన్నిక అనివార్యమైంది. దీంతో బుధవారం 11గంటల నుంచి లోక్ సభలో స్పీకర్ పదవికి ఓటింగ్ జరగనుంది. అయితే స్పీకర్ ఎన్నిక విషయంలో మద్దతివ్వాలని కోరుతూ మల్లికార్జున్ ఖర్గేకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజ్ఞప్తి చేయగా..ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే స్పీకర్ పదవికి మద్దతిస్తామని సూచించారు. దీనిపై బీజేపీ నుంచి స్పందన రాకపోవడంతోనే ఇండియా కూటమి స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్టినట్టు తెలుస్తోంది.

విప్ జారీ చేసిన కాంగ్రెస్, బీజేపీ

స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో బుధవారం లోక్‌సభకు తప్పకుండా హాజరు కావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. కాంగ్రెస్ చీఫ్ విప్ సురేష్ దీనిని జారీ చేశారు. సభ వాయిదా పడే వరకు బయటకు వెళ్లొద్దని ఆదేశించారు. అలాగే బీజేపీ సైతం తమ సభ్యులకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాల మూడో రోజు తప్పకుండా సభలో ఉండాలని సూచించింది. అలాగే ఎన్డీయే కూటమిలోని పార్టీలు, ఇండియా కూటమిలోని పార్టీలు కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.

ఓం బిర్లాకే చాన్స్!

లోక్‌సభ స్పీకర్‌ను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం ఎన్నుకుంటారు. స్పీకర్‌గా ఎన్నిక కావడానికి నిర్దిష్ట అర్హతలు ఏమీ లేనప్పటికీ, రాజ్యాంగం, పార్లమెంటరీ విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం. అయితే ప్రస్తుతం ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికవ్వడం సులభమే. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి 271 ఓట్లు అవసరం ఉండగా..ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమికి 233 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో ఓం బిర్లా ఎన్నికవడం ఖాయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

48 ఏళ్ల తర్వాత ఓటింగ్

ప్రస్తుత లోక్ సభ స్పీకర్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే 50ఏళ్ల అనంతరం ఈ పదవికి ఎన్నిక జరగనుంది. గతంలో స్వత్రంత్ర భారత చరిత్రలో 1952లో మొదటి లోక్ సభ ఏర్పాటయ్యాక ఎన్నిక జరగగా ఆ ఎన్నికల్లో గెలిచిన జీవీ మౌలాంకర్ తొలి లోక్ సభ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం1976లో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అప్పటి నుంచి ప్రతి లోక్ సభలోనూ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతోంది. గతంలో 2014, 2019లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటం వల్ల ఎన్నిక ఏకగ్రీవమైంది.

డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇవ్వాలి: రాహుల్

లోక్‌సభ స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవికి పోటీ చేసే ఎన్డీఏ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత రాహుల్ ఈ ప్రకటన చేశారు. అలాగే స్పీకర్‌ పదవి విషయమై ఇండియా కూటమి షరతులు విధించటం సరికాదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగేటప్పుడు విపక్షాల డిమాండ్‌ను పరిశీలించేందుకు అంగీకరించామని అయినప్పటికీ అభ్యర్థిని బరిలో నిలిపారన్నారు.

Advertisement

Next Story