Olympics: ప్రతి ఒలింపిక్ అథ్లెట్‌కు రూ.5 లక్షలు..కర్ణాటక ప్రభుత్వం ఆఫర్

by vinod kumar |
Olympics: ప్రతి ఒలింపిక్ అథ్లెట్‌కు రూ.5 లక్షలు..కర్ణాటక ప్రభుత్వం ఆఫర్
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే వారం ప్రారంభం కానున్న 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రానికి చెందిన మొత్తం తొమ్మిది మంది అథ్లెట్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదివారం ఆమోదం తెలిపారు. కర్ణాటక ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరాజు విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రోత్సాహకాన్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నుంచి ఒలంపిక్స్‌లో పాల్గొనే వారికి ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. దీంతో ఒలింపిక్ క్రీడాకారులకు ఇలాంటి సహాయాన్ని అందించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.

రాష్ట్ర క్రీడాకారులతో సహా భారత క్రీడాకారులందరూ పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి దేశ కీర్తిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు సిద్ధరామయ్య తెలిపారు. కాగా, జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఒలంపిక్ క్రీడలు జరగనున్నాయి. మొత్తంగా భారత్ తరఫున117 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించనుండగా..కర్ణాటక నుంచి రోహన్ బోపన్న సహా 9 మంది అథ్లెట్లు క్రీడల్లో పాల్గొననున్నారు.



Next Story