జగన్నాథ ఆలయం సురక్షితంగా లేదు : ప్రధాని మోడీ

by Hajipasha |
జగన్నాథ ఆలయం సురక్షితంగా లేదు : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : బిజూ జనతా దళ్(బీజేడీ) ప్రభుత్వ హయాంలో ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రసిద్ధ జగన్నాథ ఆలయం సురక్షితంగా లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. పాలనా వైఫల్యం వల్లే ఈ విఖ్యాత ఆలయానికి సంబంధించిన రత్న భాండార్ (ట్రెజరీ ఫండ్) తాళంచెవులు గత ఆరేళ్లుగా దొరకడం లేదని ఆయన మండిపడ్డారు. ఒడిశా ప్రభుత్వం పూర్తిగా అవినీతిపరుల నియంత్రణలో ఉందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. పూజల అనంతరం బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సంబిత్ పాత్రతో కలిసి పూరీలోని మార్చికోట్ చౌక్ నుంచి మెడికల్ స్క్వేర్ వరకు రెండు కిలోమీటర్ల రోడ్ షోలో మోడీ పాల్గొన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడ్డాక..

25 ఏళ్లుగా బీజేడీ ప్రభుత్వమున్నా.. ఒడిశా ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని ప్రధాని మోడీ విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడ్డాక అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందన్నారు. గత పదేళ్లలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దేశ ప్రజలంతా చూశారని ఆయన పేర్కొన్నారు. ‘‘21వ శతాబ్దపు ఒడిశా అభివృద్ధిలో వేగం కావాలి. అది కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది’’ అని ప్రధాని చెప్పారు. “పూరీలో మహాప్రభు జగన్నాథుడిని ప్రార్థించాను. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలి. మమ్మల్ని పురోగతి యొక్క కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలి’’ అని ఆయన తెలిపారు. గత 10 రోజుల్లో ప్రధాని మోడీ ఒడిశాలో పర్యటించడం ఇది రెండోసారి. ఒడిశాలో ఎన్నికలకు ముందు బీజేపీ, బీజేడీ పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు విఫలమవడంతో ఆ పార్టీల మధ్య పోరు మరింత ముదిరింది. 2009లో తమ భాగస్వామ్యాన్ని ముగించడానికి ముందు బీజేపీ-బీజేడీ తొమ్మిదేళ్ల పాటు ఒడిశాను పొత్తుతో పాలించాయి.

Advertisement

Next Story

Most Viewed