మసాలా ఉత్పత్తుల బ్యాన్‌.. ఎవరెస్ట్ కంపెనీ ఏం చెప్పిందంటే..

by Hajipasha |
మసాలా ఉత్పత్తుల బ్యాన్‌.. ఎవరెస్ట్ కంపెనీ ఏం చెప్పిందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : హాంకాంగ్, సింగపూర్‌లలో ఎవరెస్ట్ మసాలా కంపెనీకి చెందిన పలు ఉత్పత్తులు బ్యాన్ అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎవరెస్ట్ కంపెనీ స్పందించింది. ఈ ప్రచారంలో వాస్తవికత లేదని వివరణ ఇచ్చింది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ తమ ఉత్పత్తులను బ్యాన్ చేయలేదని తేల్చి చెప్పింది. తమ కంపెనీకి మొత్తం 60 రకాల మసాలా ఉత్పత్తులు ఉండగా ఒకే ఒక్క ఉత్పత్తిని (ఎవరెస్టు ఫిష్ కర్రీ మసాలా) రీకాల్ చేస్తామని హాంకాంగ్ అధికారులు ప్రకటించారని కంపెనీ వెల్లడించింది. హాంకాంగ్ ప్రకటనను ఫాలో అయిన సింగపూర్ ఫుడ్ సేఫ్టీ సంస్థ కూడా అదే మసాలా ఉత్పత్తిని (ఎవరెస్టు ఫిష్ కర్రీ మసాలా) రీకాల్ చేయాలని దిగుమతి సంస్థ ఎస్‌పీ ముత్తయ్య అండ్ సన్స్‌కు ఆర్డర్ జారీ చేసిందని పేర్కొంది. తమ కంపెనీ ఉత్పత్తి చేసే అన్ని మసాలా ఉత్పత్తుల్లో నాణ్యతకు, ప్రజారోగ్య భద్రతకు పెద్దపీట ఉంటుందని ఎవరెస్ట్ కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు భారతీయ మసాలా ఉత్పత్తులపై సింగపూర్, హాంకాంగ్‌లు నిషేధం విధించాయనే వార్తల నడుమ కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తనిఖీల కోసం దేశంలోని అన్ని ప్రముఖ మసాలా కంపెనీల నుంచి శాంపిళ్లను సేకరించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అధ్యయన నివేదిక 20 రోజుల్లోగా విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

Next Story