కన్నయ్య కుమార్ నామినేషన్: నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలోకి

by samatah |
కన్నయ్య కుమార్ నామినేషన్: నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలోకి
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ నేత, ఢిల్లీ జేఎన్‌యూ మాజీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ఈశాన్య ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ సమక్షంలో నంద్ నగ్రిలోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతుకుముందు కన్నయ్య ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తను అన్యాయానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడతానని తెలిపారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బాణాసంచా కాల్చొద్దని విజ్ఞప్తి చేశాడు. ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. కన్నయ్య 2019 ఎన్నికల్లో బిహార్‌లోని బెగూసరాయ్ సెగ్మెంట్ నుంచి సీపీఐ తరఫున పోటీ చేశారు. కాగా, ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆప్ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఢిల్లీలోని మొత్తం 7 లోక్ సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది.

Advertisement

Next Story