కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు నో.. 27నే విచారణ

by Hajipasha |
కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు నో.. 27నే  విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో : ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టు, ఈడీ రిమాండ్‌‌పై మార్చి 24( ఆదివారం)లోగా అత్యవసర విచారణ జరపాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. దీనిపై అంత అర్జెంట్‌గా విచారణ నిర్వహించలేమని, వచ్చే బుధవారం (మార్చి 27న) కోర్టు తెరుచుకున్నాక విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. విచారణ కోసం అప్పటివరకు వేచిచూడాల్సిందే అని తేల్చి చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో కోర్టుకు మంగళవారం (మార్చి 26) వరకు సెలవులు ఉండనున్నాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ పిటిషన్‌ బుధవారం తిరిగి విచారణకు రానుంది. మార్చి 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. వీటిని సవాల్ చేస్తూనే ఎగువ కోర్టుగా ఉన్న ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. బుధవారం హైకోర్టులో జరగనున్న విచారణలో ఆయా అంశాలపై ఈడీ, కేజ్రీవాల్ పక్షాల తరఫు న్యాయవాదుల మధ్య వాడివేడి వాదనలు జరగనున్నాయి. ఇక సునీతా కేజ్రీవాల్‌ తన భర్త అరవింద్ కేజ్రీవాల్‌ను శనివారం సాయంత్రం ఈడీ ప్రధాన కార్యాలయంలో కలిశారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆదివారం రోజు ఆప్ శ్రేణులు ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఈసందర్భంగా కొవ్వొత్తులతో మార్చ్, దిష్టిబొమ్మల దహనం వంటి వినూత్న ఆందోళనలను చేపట్టనున్నాయి.

Advertisement

Next Story