‘బజరంగ్‌దళ్‌ను నిషేధించే ప్రతిపాదన లేదు’

by Sathputhe Rajesh |
‘బజరంగ్‌దళ్‌ను నిషేధించే ప్రతిపాదన లేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్నాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత బజరంగ్‌దళ్‌ను నిషేధించాలనే ఆలోచన లేక ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీకి లేదని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. నిజానికి నిర్దిష్టంగా కొన్ని సంస్థలపై నిషేధం విధించే అధికారం రాష్ట్రాలకు ఉండదన్నారు. కర్నాటక ఎన్నికల సందర్భంగా ఉడిపికి వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన కర్నాటక ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్, పాపులర్ ఫ్రంట్ సంస్థలపై నిషేధం గురించి ప్రకటన చేసిందని గుర్తుచేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పై రెండు సంస్థల్లాంటివాటిపై నిషేధం విధించాలన్నది మేనిఫెస్టోలోని సారాంశమన్నారు.

విద్వేషకర ప్రసంగాలను చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బహుశా ఇలాంటి ప్రతిపాదన చేసి ఉండొచ్చని అన్నారు. మహాత్మగాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ సంస్థను అప్పటి కేంద్ర మంత్రి సర్దార్ పటేల్ నిషేధించారని, ఇప్పుడు అదే నేతను బీజేపీ ఆరాధిస్తూ ఉన్నదని అన్నారు. చివరకు ప్రధాని నెహ్రూయే ఆ నిషేధాన్ని ఎత్తివేశారని, ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేస్తున్నవాటిపై నిషేధం తగదనే కామెంట్ చేశారని మొయిలీ గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed