CAG report: ఆమ్ ఆద్మీ పార్టీ నెత్తిన మరో పిడుగు

by Shamantha N |
CAG report: ఆమ్ ఆద్మీ పార్టీ నెత్తిన మరో పిడుగు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ నెత్తిన మరో పిడుగు పడిపోయింది. ఆప్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొహల్లా క్లినిక్ లలో పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయినట్లు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలో వెల్లడయ్యింది. ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో సంచలనాలు బయటపడ్డాయి. ముఖ్యంగా, ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన విషయంలో గత ఆరేళ్లుగా తీవ్ర ఆర్థిక దుర్వినియోగం, నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోడాన్ని కాగ్ నివేదిక హైలెట్ చేసింది. ఆరోగ్య సంరక్షణ కార్మికుల తీవ్రమైన కొరత, మొహల్లా క్లినిక్‌లలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, అత్యవసర నిధుల వినియోగం తక్కువగా ఉండటం వంటి వాటిని ప్రస్తావించింది.

14 ఆస్పతుల్లో ఐసీయూ లేదు

మొహల్లా క్లినిక్‌లు కూడా దయనీయ స్థితిలో ఉన్నాయని కాగ్ నివేదికలో వెల్లడయ్యింది. కనీసం వీటిలో టాయిలెట్లు కూడా లేవని వెల్లడించింది. అనేక ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేవని నివేదిక స్పష్టం చేసింది. ఢిల్లీలోని 14 ఆస్పత్రుల్లో కనీసం ఐసీయూలే లేకపోవడం గమనార్హమని కాగ్ నివేదిక తెలిపింది. అంతేకాకుండా, అంతేకాకుండా, ఆయుష్ డిస్పెన్సరీల్లో అవసరమైన ఔషధాలు అందుబాటులో లేవని స్పష్టం చేసింది. ఢిల్లీలో 27 ఆస్పత్రులుండగా, అందులో 14 ఆస్పత్రుల్లో ఐసీయూ విభాగమే లేదని పేర్కంది. అలాగే, 16 ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంక్‌లు లేవని,8 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయం కూడా అందుబాటులో లేదని తెలిపింది. మరో 15 ఆస్పత్రుల్లో మార్చురీ సదుపాయాలు లేవని, 12 ఆస్పత్రులకు అంబులెన్సు సదుపాయం కూడా లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంది.

కేవలం సగం మాత్రమే పూర్తి

2023 నాటికి 1,000 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, కేవలం సగమే పూర్తి చేయగలిగిందని కాగ్ నివేదిక పేర్కొంది. అయితే, అందులోనూ సరైన మౌలిక వసతులు లేవని వెల్లడించింది.ఇవి మాత్రమే కాకుండా, ఢిల్లీ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రమైన స్థాయిలో ఉందని నివేదిక తెలియజేస్తోంది. కొన్ని ఆస్పత్రుల్లో 21% నర్సుల కొరత ఉండగా, 38% పారామెడికల్ సిబ్బంది, 50% నుంచి 96% వరకు వైద్య సిబ్బంది లేమి ఉందని వివరించింది. రాజీవ్ గాంధీ,జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ పడకలు, ప్రైవేట్ గదులు పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయంది. అలాగే, ట్రామా సెంటర్లలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం నిపుణులైన వైద్యులు లేరంది. కరోనా చికిత్స కోసం కేటాయించిన రూ.787.91 కోట్లలో కేవలం రూ.582.84 కోట్లు మాత్రమే వినియోగించారని నివేదిక వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కేటాయించిన రూ.3.52 కోట్లు ఖర్చ చేయలేదని.. అత్యవసర ఔషధాలు, పీపీఈ కిట్ల కోసం కేటాయించిన రూ.83.14 కోట్లు వినియోగించలేదంది. కొన్ని ఆసుపత్రుల్లో ఆక్యుపెన్సీ రేట్లు 101 శాతం - 189 శాతంగా ఉన్నాయని.. దీంతో రోగులు నేలపైనే పడుకోవాల్సి వస్తుందంది. ప్రధాన ఆసుపత్రి ప్రాజెక్టులు 3-6 సంవత్సరాల జాప్యాన్ని ఎదుర్కొన్నాయంది. ఖర్చు పెరుగుదల రూ. 382.52 కోట్లకు చేరుకుందని నివేదిలో ఉంది. లోక్ నాయక్ హాస్పిటల్‌లోని రోగులు సాధారణ శస్త్రచికిత్సల కోసం 2-3 నెలలు.. కాలిన గాయాలు లేదా ప్లాస్టిక్ సర్జరీల కోసం 6-8 నెలలు వేచి చూస్తున్నారంది. సీఎన్ బీసీ హాస్పిటల్‌లో పిల్లల శస్త్రచికిత్సల కోసం 12 నెలల నిరీక్షణ కాలం ఉందంది.

Next Story