- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు

దిశ, హనుమకొండ : అమాయక రైతులను లక్ష్యంగా చేసుకొని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలోని ఏడుగురిని టాస్క్ ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఒకరు పరారీ అయ్యాడు. నిందితుల నుండి పోలీసులు సుమారు రూ. 78 లక్షల 63వేల విలువ గల గడువు తీరిన నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల తయారీ మిషనరీ, ప్రింటింగ్ సామగ్రి, రెండు కార్లు, ఆరు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. ఇరుకుల్ల వేద ప్రకాశ్, మహ్మద్ సిద్దిక్ అలీ, నూక రాజేష్ అలియాస్ రాజు, యల్లం సదాశివుడు, ఎండీ. రఫీక్, ఆళ్ల చెరువు శేఖర్, పొదిళ్ల సాంబయ్య, విష్ణు వర్థన్ ( ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ), ముద్దగుల ఆదిత్య (ప్రస్తుతం జైలులో ఉన్నాడు) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, మట్టెవాడ పోలీసులు, వ్యవసాధికారులు సంయుక్తంగా కలిసి మట్టెవాడ బొడ్రాయి ప్రాంతంలోని ప్రధాన నిందితుడు ఇరుకుళ్ల వేదప్రకాశ్ ఇంటిపై దాడి చేసి మరో ముగ్గురు నిందితులు సిద్దిక్, రాజేష్, సదాశివుడు లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నకిలీ, గడువు తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన ఇరుకుళ్ల వేదప్రకాశ్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో స్థానికంగా ఉండే పురుగు మందుల వ్యాపారస్తుల నుండి, స్థానిక పురుగు మందుల కంపెనీ ప్రతినిధి నుంచి, ఆళ్లచెరువు శేఖర్, విష్ణువర్ధన్, ప్రస్తుతం జైలులో ఉన్న ఆదిత్యల నుండి పెద్ద మొత్తంలో కాలం తీరిన పురుగు మందులను కోనుగోలు చేసేవాడు. ఈ విధంగా సేకరించిన గడువు తీరిన పురుగు మందులతో పాటు, నకిలీ పురుగు మందులను మిగతా నిందితులకు విక్రయించేవాడు. వీటిని కొనుగోలు చేసిన నిందితులు స్థానికంగా ఉన్న వ్యవసాయదారులకు విక్రయిస్తూ మోసగించేవారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడితో పాటు సదాశివుడు, రాజు, ఆదిత్యలు గతంలోనూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆళ్లచెరువు శేఖర్, విష్ణువర్ధన్‌ల గోదాములపై టాస్క్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు దాడులు చేసి పెద్ద మొత్తంలో నకిలీ పురుగు మందులు, వీటి తయారీకి వినియోగించే యంత్ర సామగ్రి, లేబుళ్లు, కల్తీ విత్తనాలు, రెండు కార్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ వ్యవహారంలో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్, వరంగల్ ఏసీపీలు మధుసూదన్, నందిరామ్ నాయక్, ఇన్స్పెక్టర్లు ఎస్. రాజు, గోపి, ఎస్‌ఐలు వంశీకృష్ణ, నవీన్, ఆర్‌ఎస్‌ఐ భాను ప్రకాశ్ , ఏఏఓ సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు సురేష్, సురేందర్, సాంబరాజు, శ్రీనివాస్, సతీష్ కుమర్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు.