Amit Shah in J-K: కశ్మీర్ దహనం అవుతుండగా ఏం చేశారు?.. ఫరూఖ్ అబ్దుల్లాపై అమిత్ షా విమర్శలు

by Shamantha N |
Amit Shah in J-K: కశ్మీర్ దహనం అవుతుండగా ఏం చేశారు?.. ఫరూఖ్ అబ్దుల్లాపై అమిత్ షా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీర్ దహనం అవుతుండగా ఏం చేశారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాఔరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ, అధికారం వచ్చాక 370 ఆర్టికల్‌ను పునరుద్ధరిస్తామని ఫరూక్‌ అబ్దుల్లా (Farooq Abdullah)చెబుతున్నారు. ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేదు. జమ్ముకశ్మీర్‌లో 30 ఏళ్లుగా ఉగ్రవాదం కొనసాగింది. దాని వల్ల 40 వేల మంది చనిపోయారు. కశ్మీర్ దహనం అవుతున్నప్పుడు ఫరూఖ్ అబ్దుల్లా ఏం చేశారు? ఫరూఖ్ సాబ్ లండన్ లో హాయిగా సెలవు తీసుకున్నారు.’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

కాల్పులు జరిపే సాహసం చేయలేరు

జమ్ముకశ్మీర్ ప్రాంతంలో బంకర్ల అవసరం లేదన్న అమిత్ షా.. ఇప్పుడు కాల్పులు జరిపే సాహసం ఎవరూ చేయలేరని అన్నారు. ఎందుకంటే, బుల్లెట్లకు బుల్లెట్లతోనే జవాబు చెప్తామని హెచ్చరించారు. జమ్మకశ్మీర్‌లో మూడు రంగుల జెండానే రెపరెపలాడుతుందన్నారు. ఇక ఉగ్రవాదంపై ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ‘‘కొందరు పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని కోరుకుంటున్నారు. కానీ, టెర్రరిజం అంతం అయ్యే వరకు పాక్ తో చర్చలు జరిపేది లేదు. దేశంపై దాడులకు పాల్పిడన వారిని విడుదల చేయాలని వారు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) కోరుకుంటున్నారు. కానీ, మోడీ సర్కార్‌ ఆ పని ఎప్పటికీ చేయదు. భారత ప్రజలపై రాళ్లు రువ్విన వారికి కారాగారం నుంచి విముక్తి కల్పించేది లేదు’’ అని షా మరోసారి స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు

కాగా.. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సెప్టెంబరు 18న తొలి దశ పోలింగ్ జరిగింది. ఏడు జిల్లాల పరిధిలో తొలిదశ కింద 24 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 61 శాతం పోలింగు నమోదైంది. సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ జరుగుతున్నాయి. అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Next Story

Most Viewed