రతన్ టాటా వారసులు ఎవరూ?

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-10 06:45:47.0  )
రతన్ టాటా వారసులు ఎవరూ?
X

దిశ, వెబ్ డెస్క్ : దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ సంస్థల గౌరవ చైర్మన్‌ రతన్ టాటా(86) మరణంతో ఇక ఆయన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రతన్ టాటా వివాహం చేసుకోకపోవడంతో అతనికి పిల్లలు లేరు. అందుకే అతని మరణానంతరం అతని ఆస్తికి వారసులు ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రతన్ టాటా నిష్క్రమణ తర్వాత అతని వ్యాపార పగ్గాలను ఎవరు చేపడతారో తెలుసుకోవాలనుకునేవారు ఆయన కుటుంబం వివరాలను తెలుసుకోవాల్సిందే. రతన్ టాటా తల్లిదండ్రుల పేర్లు నావల్ టాటా, సూని కమిషరియట్‌లు. వీరు 1940లలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నావల్ టాటా 1955లో స్విస్ మహిళ సిమోన్ ను వివాహం చేసుకున్నారు. అతని కుమారులలో ఒకరి పేరు నోయెల్ టాటా. రతన్ టాటాకు పిల్లలు లేనందున, బిలియన్ల విలువైన ఈ ఆస్తి అతని సవతి సోదరుడు నోయెల్ టాటా తరపువారికి చేరే అవకాశం ఉంది. నోయెల్ టాటాకు మాయ, నావల్, లేహ్ టాటా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా ఆస్తి రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా సంతానానికే దక్కే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

మాయ టాటా బేయెస్ బిజినెస్ స్కూల్ వార్విక్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీలు పొందింది. ఆమె తన కెరీర్ ను టాటా ఆపర్చునిటీ ఫండ్ తో ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె టాటా డిజిటల్ కు మారారు. అక్కడ ఆమె టాటా న్యూ యాప్ ను అభివృద్ధి చేయడం.. ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ప్రస్తుతం తన తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు. మాయా టాటా తల్లి దివంగత టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి.. దివంగత బిలియనీర్ పల్లోంజ్ మిస్ట్రీ కుమార్తె.

ఇక మాయా టాటా సోదరుడు 32ఏండ్ల నెవిల్లే టాటా కుటుంబ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు. అతను రతన్ టాటా సామ్రాజ్యానికి వారసుడిగా కూడా భావిస్తున్నారు. అతను టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి జంషెడ్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్ కు నెవిల్లే నాయకత్వం వహిస్తున్నారు. అంతకుముందు, అతనికి ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ బెవరేజ్ విభాగం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అందులో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న తర్వాత, అతను జూడియో, వెన్సైడ్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. అతను టాటా గ్రూపుకు వారసుడిగా తయారయ్యాడని చాలా మంది నిపుణుల భావన.

నెవిల్లే, మాయా టాటా సోదరి 39ఏండ్ల లేహ్ టాటా టాటా గ్రూప్ హోటల్ వ్యాపారం పర్యవేక్షిస్తున్నారు. ఆమె స్పెయిన్ లోని ఐఈ బిజినెస్ స్కూల్ లో చదివారు. అమె 2010లో కొంతకాలం లూయిస్ విట్టన్ లో ఇంటర్నిషిప్ చేశారు. ఆమె తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్ లలో పని చేసింది. ఇప్పుడు ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Advertisement

Next Story