'వివాదాస్పద బూత్‌ల సమాచారాన్ని ఈసీ ఇవ్వలేదు'.. బీఎస్ఎఫ్ డీఐజీ కీలక కామెంట్స్

by Vinod kumar |
వివాదాస్పద బూత్‌ల సమాచారాన్ని ఈసీ ఇవ్వలేదు.. బీఎస్ఎఫ్ డీఐజీ కీలక కామెంట్స్
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల వేళ శనివారం జరిగిన హింసపై బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఎస్.ఎస్. గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బలగాలను మోహరించిన చోట్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణలు జరిగే అవకాశమున్న సున్నిత ప్రాంతాల్లోని అన్ని పోలింగ్ బూత్‌ల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తమకు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. జూన్ 7న చివరిసారిగా తమకు రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల సంఖ్యపై బెంగాల్ ప్రభుత్వం సమాచారాన్ని పంపిందని.. అయితే అందులో అన్ని సమస్యాత్మక పోలింగ్ బూత్ ల అడ్రస్ లు కానీ, లొకేషన్లు కానీ లేవని ఎస్.ఎస్.గులేరియా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన చోట మాత్రమే తాము బలగాలను మోహరిస్తామని చెప్పారు.

25 రాష్ట్రాల నుంచి 59,000 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(CAPF) బెంగాల్ కు వచ్చినా.. సెన్సిటివ్ బూత్‌ లు అన్నింటిలో వారిని మోహరించలేదన్నారు. "బెంగాల్ లో ఎక్కువగానే సమస్యాత్మక పోలింగ్ బూత్‌ లు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4834 బూత్‌ లను సెన్సిటివ్ బూత్‌ లుగా ప్రకటించి అక్కడ మాత్రమే కేంద్ర బలగాలను మోహరించింది. అందువల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి" అని వ్యాఖ్యానించారు.

బెంగాల్ ఎన్నికల హింసలో 18కి పెరిగిన మృతుల సంఖ్య..

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల హింసలో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 18కి పెరిగింది. శనివారం పోలింగ్ వేళ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 11 మంది మృతిచెందారు. అయితే గాయాలతో ఆసుపత్రుల్లో చేరిన మరో ఏడుగురు కూడా మరణించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ముర్షిదాబాద్‌లో ఐదుగురు, ఉత్తర దినాజ్‌పూర్ లో నలుగురు, కూచ్ బెహర్ లో ముగ్గురు చనిపోయారు. మిగితా 6 మరణాలు మాల్దా, దక్షిణ 24 పరగణాలు, నదియా, తూర్పు బుర్ద్వాన్‌లలో చోటుచేసుకున్నాయి. జూన్ 8న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి చోటుచేసుకున్న రాజకీయ ఘర్షణల్లో మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed