ఫ్లైట్లో ఏసీ లేక ప్రయాణికుల ఇబ్బందులు.. చెమట తుడుచుకోవడానికి టిష్యూ పేపర్స్ ఇచ్చిన సిబ్బంది

by Javid Pasha |   ( Updated:2023-08-07 09:08:16.0  )
ఫ్లైట్లో ఏసీ లేక ప్రయాణికుల ఇబ్బందులు.. చెమట తుడుచుకోవడానికి టిష్యూ పేపర్స్ ఇచ్చిన సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్: విమానంలో ప్రయాణం అంటే సామాన్యులకు అదో తీరని కోరిక. విలాసవంతమైన జీవితానికి అది ప్రతీక. కానీ ఫ్లైట్ లో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన చంఢీగర్ నుంచి జైపూర్ కు వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (6E7261)లో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండిగో కంపెనీకి చెందిన ఓ ఫ్లైట్ (6E7261) చండీఘర్ నుంచి జైపూర్ కు బయలుదేరింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండింగ్ అయ్యే వరకు దాదాపు రెండుగంటల పాటు ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఇదే విషయాన్ని ఫ్లైట్ సిబ్బందిని నిలదీయగా టెక్నికల్ ప్రాబ్లం అంటూ బదులిచ్చారు. ఇక ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు చెమటతో తడిచిపోయారు. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు గాలి కోసం పేపర్లను తీసుకొని ఊపుకున్నారు. ఇక చెమటతో తడిసిపోయిన ప్రయాణికులకు తుడుచుకోండి అంటూ ఫ్లైట్ సిబ్బంది టిష్యూ పేపర్స్ ఇవ్వడం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.

ఇండిగో విమానాల్లో ఒక్కరోజులో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మూడోసారని అన్నారు. ఢిల్లీకి ఎగురుతున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో ఒకటి పనిచేయకపోవడంతో శుక్రవారం పాట్నా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని, విమానం బయలుదేరిన మూడు నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు. పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో ఉదయం 9:11 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అన్నారు. మరో సంఘటనలో రాంచీకి బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన గంటలోపు ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)లను కోరారు.

Advertisement

Next Story