బిహార్: బలపరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్ సర్కార్.. మద్దతుగా 129 ఓట్లు

by GSrikanth |   ( Updated:2024-02-12 15:03:25.0  )
బిహార్: బలపరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్ సర్కార్.. మద్దతుగా 129 ఓట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. సోమవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం విజయం సాధించింది. జేడీయూ చీఫ్ నితీశ్‌కు మద్దతుగా 130 ఓట్లు వచ్చాయి. దీంతో 130-0 ఓట్ల తేడాతో జేడీయూ, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలిచినట్లుగా సభాపతి ప్రకటించారు. ఆర్జేడీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలోకి వచ్చారు. వారు ఎన్డీఏ కూటమి తరఫున క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో అసెంబ్లీలో నితీశ్ అండ్ టీమ్ బలం మునుపటి కంటే మరో మూడు స్థానాలు పెరిగింది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార పక్షం కుర్చీలలో కూర్చోవడంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సభా నియమాల ఉల్లంఘనను ఆపాలని స్పీకర్‌ను కోరారు. అధికారపక్షం తమ ఎమ్మెల్యేలను బలవంతంగా లొంగదీసుకుందని ఆరోపించారు. అయితే దీనిపై చర్యలు తీసుకునేందుకు సభాపతి నిరాకరించారు. దీంతో మహాఘట్బంధన్ కూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు సోమవారం ఉదయం అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాగానే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగించారు. ఆ వెంటనే స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిని పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. స్పీకర్‌‌ను తొలగించే విషయంలో 125 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయగా...వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చాయి. ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ కొత్త స్పీకర్‌గా బాధ్యతలను స్వీకరించి సభా కార్యకలాపాలను కొనసాగించారు.

Advertisement

Next Story