ప్రధానితో సీఎం నితీష్ భేటీ.. మళ్లీ ఎన్డీఏను వదలనని వెల్లడి

by Hajipasha |
ప్రధానితో సీఎం నితీష్ భేటీ.. మళ్లీ ఎన్డీఏను వదలనని వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన తర్వాత ప్రధానితో నితీష్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. బిహార్‌లోనూ ఆరు రాజ్యసభ స్థానాలను భర్తీ చేయనున్నారు. వాటిపై ప్రధాని మోడీతో నితీష్ భేటీ సందర్భంగా డిస్కషన్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా బిహార్‌కు సంబంధించిన అనేక పాలన, రాజకీయపరమైన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం నితీష్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘2013లో నేను ఎన్డీఏ కూటమితో బంధాన్ని తెంచుకున్నాను. అయితే అంతకంటే ముందు 1995 నుంచి 2013 వరకు మా జేడీయూ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగానే వ్యవహరించింది. ఇప్పటిదాకా రెండుసార్లు ఎన్డీఏను విడిచిపెట్టాను. ఇకపై అలా జరగదు. మళ్లీ ఎన్డీఏ కూటమిని వదలను’’ అని స్పష్టం చేశారు. తప్పకుండా ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానన్నారు.

Advertisement

Next Story