Nipah Virus: నిఫా వైరస్‌ను విజయవంతంగా నియంత్రించాం.. కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ

by vinod kumar |
Nipah Virus: నిఫా వైరస్‌ను విజయవంతంగా నియంత్రించాం.. కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో నిఫా వైరస్ వ్యాప్తిని విజయవంతంగా నియంత్రించినట్లు కేరళ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. 42 రోజుల డబుల్ ఇంక్యుబేషన్ పీరియడ్ పూర్తైన తర్వాత కేసులు నమోదైన ప్రాంతంలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పరిశీలనలో ఉంచిన మొత్తం 472 మందిని కాంటాక్ట్ లిస్ట్ నుండి తొలగించినట్టు తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూంను సైతం రద్దు చేసినట్లు వెల్లడించారు.

నిఫా వైరస్‌ సోకి మరణించిన చిన్నారికి మాత్రమే పాజిటివ్‌గా నిర్థారణ అయిందని, ఆరోగ్య శాఖ అమలు చేసిన వేగవంతమైన, పటిష్టమైన నియంత్రణ చర్యల వల్ల వైరస్‌ ఇతరులకు వ్యాపించకుండా నిరోధించగలిగామని చెప్పారు. నిఫా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా సమిష్టిగా కృషి చేసిన వైద్య బృందాన్ని ఆమె అభినందించారు. వైరస్ వ్యాప్తి చెందిన వెంటనే, నిఫా మార్గదర్శకాలను అనుసరించి 25 కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా దాని వ్యాప్తిని అరికట్టడానికి ఆరోగ్య శాఖ చొరవ తీసుకున్నట్టు తెలిపారు. కాగా, కేరళలోని మలప్పురం జిల్లాలో జూన్ 21న నిఫా వైరస్ కారణంగా 14 ఏళ్ల బాలుడు మరణించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed