Roma Ray : నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు రోమా రే కన్నుమూత

by Hajipasha |
Roma Ray : నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు రోమా రే కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో : నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు రోమా రే 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. బుధవారం దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ రోమా రే చనిపోయారు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోమా రే తండ్రి శరత్‌చంద్ర బోస్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది. 1930వ దశకంలో ఒక బాలికగా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర పోరాట ప్రస్థానాన్ని రోమా రే చాలా దగ్గరి నుంచి గమనించారు. 1938 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నేతాజీ ఎన్నికయ్యారు.

1950వ దశకంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో రోమా రే నివసించారు. నేతాజీ సతీమణి ఎమిలీ షెంకల్ వియన్నా వాస్తవ్యురాలే. అందువల్ల ఎమిలీ షెంకల్‌‌తో సన్నిహితంగా మెలిగే అవకాశం రోమా రేకు లభించింది. 1996 సంవత్సరంలో జర్మనీలో జరిగిన ఎమిలీ షెంకల్‌‌ అంతిమ యాత్రకు రోమా రే హాజరై ఎమోషనల్‌గా ప్రసంగించారు. కోల్‌కతాకు చెందిన ప్రముఖ వైద్యుడు సచిస్ రేను రోమా రే పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Next Story