Neet ss exam: ఎన్ఎంసీ నిర్ణయం సరైందే.. నీట్-ఎస్ఎస్ పరీక్షపై సుప్రీంకోర్టు

by vinod kumar |
Neet ss exam: ఎన్ఎంసీ నిర్ణయం సరైందే.. నీట్-ఎస్ఎస్ పరీక్షపై సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ (నీట్-ఎస్ఎస్) పరీక్షను నిర్వహించొద్దని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తే గతంలో నీట్ ఎస్ఎస్ పరీక్షకు హాజరైన వారికి నష్టం జరగబోదని పేర్కొంది. ఈ మేరకు సీజేఐ చంద్ర చూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. అయితే ఈ ఏడాది పరీక్ష నిర్వహించడం వల్ల 2021 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు తమ కోర్సును 2025 జనవరిలో మాత్రమే పూర్తి చేయాలనుకుంటున్నారని తెలిపింది. ఎన్ఎంసీ నిర్ణయం న్యాయమైందని అభిప్రాయపడింది. ఆ డెసిషన్‌ను ఏకపక్షంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అలాగే నీట్ ఎస్ఎస్ 2024 కోసం వెంటనే షెడ్యూలు రూపొందించాలని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది.

2025 జనవరిలో పీజీ కోర్సులు పూర్తి చేస్తున్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని 30 రోజుల్లోగా షెడ్యూల్ ప్రకటించాలని ఎన్ఎంసీని ఆదేశించింది. వచ్చే ఏడాది మూడు నెలల లోపే పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కాగా, కొవిడ్ మహమ్మారి 2019 కారణంగా ఆ ఏడాది జరగాల్సిన నీట్ ఎస్ ఎస్ అడ్మిషన్లు 2022 మేలో జరిగాయి. దీంతో కోర్సు పూర్తి కాలం 2025 కి పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ విద్యార్థులకు వసతి కల్పించడానికి నీట్ ఎస్ఎస్ 2024 పరీక్షను వాయిదా వేయాలని ఎన్ఎంసీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 13 మంది వైద్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్ఎంసీ నిర్ణయాన్ని సమర్థించింది.

Advertisement

Next Story