నీట్ - యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం

by Hajipasha |
నీట్ - యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో : మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గంగాధర్ అనే వ్యక్తిని సీబీఐ అరెస్టు చేయబోయి.. అదే పేరును కలిగిన ఇంకో వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి (గంగాధర్ గుండె) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించగా.. తాజాగా శుక్రవారం బెెయిల్‌ మంజూరైంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఉపాధ్యాయులు సంజయ్‌ తుకారాం జాదవ్‌, జలీల్‌ ఉమర్‌ ఖాన్‌ పఠాన్‌లను గత నెల చివరి వారంలోనే సీబీఐ అరెస్టు చేసింది. వారు పోలీసులకు వాంగ్మూలాన్ని ఇస్తూ.. ఐరెన్నా కొనగల్వార్‌ నుంచి ఢిల్లీలోని ఉన్న గంగాధర్‌కు లీకైన ప్రశ్నాపత్రం అందిందని తెలిపారు.

గంగాధర్ ఆచూకీని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఐరెన్నా కొనగల్వార్‌ మాత్రమేనన్నారు. అయితే ఇప్పటికీ ఐరెన్నా కొనగల్వార్‌ పరారీలోనే ఉన్నాడు. ఈక్రమంలో జూన్ 25-26 మధ్య రాత్రి డెహ్రాడూన్‌లో గంగాధర్ గుండెను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. జూన్ 27న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా, జూన్ 30 వరకు సీబీఐ కస్టడీ విధించారు. తదుపరిగా జూలై 12న జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.ఈక్రమంలో సీబీఐ అధికారులు అనుకుంటున్న గంగాధర్‌ను తాను కాదని.. తనను విడుదల చేయాలని కోరుతూ గంగాధర్ గుండె దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు సానుకూలంగా తీసుకుంది. అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed