NDA : ముగిసిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-25 10:57:27.0  )
NDA : ముగిసిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్డీఏ (NDA)కూటమి పార్టీల నేతల సమావేశం ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)నివాసంలో ముగిసింది. నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని అయ్యాక ఎన్డీఏ నేతలు మూడోసారి భేటీ కావడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గెలుపు వ్యూహాలపైన.. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాలపైన ఈ భేటీలో చర్చించినట్లుగా సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు, కుమారస్వామి, జితిన్ రామ్ మాంఝీ, లలన్ సింగ్, భుపేంద్ర యాదవ్, రామ్మోహన్ నాయుడు, ప్రతాప్ రావ్ జాదవ్, అనుప్రియా పాటిల్, అరుణ్ సింగ్, రంగ్ గోరా, తుషార్ వెల్లపల్లి, వినయ్ కోరే, సంజయ్ నిషాద్, జాన్ పాండియన్, ఉపేంద్ర కుష్వా తదితర నేతలు హాజరయ్యారు.

సమావేశం వివరాలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందిస్తూ సమావేశం సుహృద్భావ వాతావరణంలో చక్కగా సాగిందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలతోపాటు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన చర్చ పై ఈ భేటీలో చర్చించినట్లు ఆయన వివరించారు. అలాగే భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి నేతలు ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే అంశంపై చర్చించామన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పలు సూచనలు, సలహాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఎంపీల నియోజకవర్గంలో అభివృద్ధి అంశాలపై సైతం చర్చ జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే అంశాలపై సైతం చర్చించామన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌తో పాటు వక్ఫ్ బోర్డుపై చర్చ జరగలేదని తెలిపారు. కాగా ఎన్డీఏ నేతల సమావేశం అనంతరం జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డాతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed