Supreme Court: క్షేత్రస్థాయి మార్పుల కోసం మరో అత్యాచారం జరిగే దాకా వేచి ఉండలేం

by Shamantha N |
Supreme Court: క్షేత్రస్థాయి మార్పుల కోసం మరో అత్యాచారం జరిగే దాకా వేచి ఉండలేం
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పుల కోసం దేశం మరో అత్యాచారం జరిగే దాకా వేచి ఉండదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, కేసులో ఇతర విధానపరమైన లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "వైద్య వృత్తుల్లో ఉన్నవారు హింసకు గురవుతున్నాయి. మహిళా వైద్యులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. మహిళ భద్రత కోసం చర్యలు తీసుకోవాలి. పరిస్థితులు మారేందుకు దేశం మరో అత్యాచారం కేసు కోసం వేచి చూడదు" అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్ పరిపాలన, స్థానిక పోలీసుల తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తింది.

ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైంది?

మృతదేహాన్ని దహన సంస్కారాలకు అప్పగించిన మూడు గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సందర్భంగా దారుణం చోటుచేసుకున్న ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ తీరుపై మండిపడింది. "ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు? ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు ఏమి చేస్తున్నారు? తీవ్రమైన నేరం జరిగింది. ఆస్పత్రిలోని వారు ఏం చేస్తున్నారు? విధ్వంసకులు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తారా?" అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ అడిగింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై తీవ్రంగా ఆగ్రహించింది.

ప్రిన్సిపల్ తీరుపై అనుమానం

‘‘ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. మధ్యాహ్నం 1:45 నుండి 4:00 గంటల మధ్య నిర్వహించిన శవపరీక్షలో వైద్యుడు హత్యకు గురైనట్లు వెల్లడైంది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు నమోదుచేయాల్సి వచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటివరకు ఏం చేస్తున్నారు?. మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు. అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు.. వెంటనే మరో కాలేజీకి అతన్ని ఎలా నియమించారు? ఇక, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైంది.’’ అని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఇకపోతే, ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని దాదాపు 56 గంటలపాటు సీబీఐ అధికారులు విచారించారు.

Advertisement

Next Story

Most Viewed