మధ్యప్రదేశ్ మహిళా ఓటర్లపై వరాల జల్లు..

by Vinod kumar |
మధ్యప్రదేశ్ మహిళా ఓటర్లపై వరాల జల్లు..
X

భోపాల్ : అసెంబ్లీ పోల్స్ సమీపిస్తున్న వేళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా ఓటర్లపై వరాల వర్షం కురిపించారు. మహిళలకు ఉద్యోగాల్లో ప్రస్తుతమున్న 30 శాతం రిజర్వేషన్‌ను 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆదివారం భోపాల్‌లో జరిగిన ‘లాడ్లీ బెహనా సమ్మేళన్’ వేదికగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల జాబ్స్‌లో 35 శాతానికి, టీచర్స్ రిక్రూట్ మెంట్‌లో 50 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. ఈ శ్రావణమాసం వేళ ఎల్పీజీ సిలిండర్లను రూ.450కే అందిస్తామని, ఆ తర్వాత కూడా శాశ్వతంగా రూ.450కే అందేలా ఏర్పాట్లు చేస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇటీవల పెంచిన విద్యుత్ బిల్లులను కాకుండా.. మునుపటి లెక్క ప్రకారమే వసూలు చేస్తామన్నారు.

లాడ్లీ బెహనా పథకంలో మహిళలకు అందించే ఆర్థిక సహాయాన్ని నెలకు రూ.1000 నుంచి రూ. 1,250కి పెంచుతున్నట్లు వెల్లడించారు. ‘రాఖీ పండుగ ఖర్చుల కోసం రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది సోదరీమణుల బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటికే రూ.250 బదిలీ చేశాను. మిగిలిన రూ.1000 సెప్టెంబరులో అకౌంట్‌లో జమ చేస్తాను. అక్టోబరు నుంచి ప్రతినెలా రూ. 1,250 అందుతాయి. ఈ మొత్తాన్ని క్రమంగా నెలకు రూ.3,000కి పెంచుతాను’ అని చెప్పారు. మహిళలు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు పారిశ్రామిక వాడల్లో స్థలాలను కేటాయిస్తామని సీఎం అన్నారు.

Advertisement

Next Story