రైతుల ఆందోళనల నడుమ మోడీ ట్వీట్.. రైతుల అసంతృప్తి

by Ramesh Goud |
రైతుల ఆందోళనల నడుమ మోడీ ట్వీట్.. రైతుల అసంతృప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనల మధ్య ప్రధాని మోడీ ట్విట్టర్ పోస్టు ఆసక్తికరంగా మారింది. గత రాత్రి మోడీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర కేబినెట్ చెరుకు మద్దతు ధరను క్వింటాల్ కు రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.315గా ఉన్న మద్దతు ధరను ఇప్పుడు రూ.340కి పెంచింది. ఈ విషయంపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మన రైతు సోదర సోదరీమణుల సంక్షేమానికి సంబందించిన ప్రతీ తీర్మాణాన్ని నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నేపధ్యంలోనే చెరుకు కొనుగోలు ధరలో పెరుగుదలకు ఆమోదం లభించిందని తెలిపారు.

ఈ పెరుగుదల వల్ల దేశంలో చెరుకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఎక్స్ లో రాసుకొచ్చారు. దేశంలో కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్లు చేస్తూ.. ఢిల్లీ ఛలో అంటూ ఆందోళనను చేపట్టారు. నాలుగు సార్లు చర్చలు జరిగిన ఫలితం లేకపోవడంతో నిరసనలు ఉదృతం చేసే యోచనలో రైతులు ఉన్నారు. ఇప్పటికే కేంద్రం ఐదోసారి చర్చలకు ఆహ్వానించగా, రైతు సంఘాల నేతల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

ఈ నేపధ్యంలో రైతుల నిరసనలపై స్పందించకుండా.. మద్దతు ధరపై స్పందించడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన రైతుల సమస్యలు పట్టించుకోకుండా.. రైతుల ప్రయోజనాలు కాపాడిన వారు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక చెరుకు ధర నామమాత్రంగా పెంచి చెరుకు రైతులకు మేలు జరుగుతుందని ఎలా అంటున్నారని వాపోతున్నారు.

Advertisement

Next Story