మోడీ చిల్లర రాజకీయవేత్తగా వ్యవహరిస్తున్నారు: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

by samatah |
మోడీ చిల్లర రాజకీయవేత్తగా వ్యవహరిస్తున్నారు: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఓ చిల్లర రాజకీయ వేత్తలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల తొలి రౌండ్ పోలింగ్ ముగిసిన తర్వాత మోడీ కనిపించని ఓటర్లను చూసి భయపడుతున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఖర్గే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో ఏమీ కానప్పుడు మోడీ ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో భారతీయులందరి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు అందజేస్తామని మోడీ చేసిన హామీ బూటకపు హామీగానే మిగిలిపోయిందని గుర్తు చేశారు. అలాగే 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు.

మోడీ దేశ చరిత్ర గురించి మరింత చదవాలని, విభజన రాజకీయాలను పారదోలి దేశాన్ని ఎలా ఐక్యంగా ఉంచాలో నేర్చుకోవాలని సూచించారు. తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శశిథరూర్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఖర్గే థరూర్‌పై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తి థరూర్ అని కొనియాడారు. ఆయన ఒక అద్బుతమైన వక్త అని తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో థరూర్ కూడా పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో థరూర్ తరఫున ఖర్గే ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు థరూర్‌పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ తరఫున బరిలో నిలిచారు.

Advertisement

Next Story