విపక్షాల డిమాండ్.. మణిపూర్ అల్లర్లపై ఎట్టకేలకు స్పందించిన మోడీ.. ఏమన్నారంటే..?

by Satheesh |
విపక్షాల డిమాండ్.. మణిపూర్ అల్లర్లపై ఎట్టకేలకు స్పందించిన మోడీ.. ఏమన్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కుకీ, మైతేయి వర్గాల మధ్య రిజర్వేషన్లకు సంబంధించి చెలరేగిన వివాదం మణిపూర్‌లో పెద్ద ఎత్తున అల్లర్లకు దారి తీసింది. మణిపూర్‌లో అల్లర్ల కారణంగా రెండు వర్గాలకు చెందిన వందల మంది పౌరుల మరణించారు. మైతేయి, కుకీ వర్గాల మధ్య రిజర్వేషన్ వార్‌తో కొన్నాళ్లు మణిపూర్ అట్టుడికిపోయింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భద్రతా దళాలను రంగంలోకి దిగిన సెంట్రల్ గవర్నమెంట్.. మణిపూర్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చింది. అయితే, మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోయినప్పటికీ ప్రధాని మోడీ ఒక్కసారి కూడా స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటించలేదు.

దీనిని అస్త్రంగా మల్చుకున్న ప్రతిపక్షాలు మోడీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. మోడీకి విదేశాల్లో పర్యటించేందుకు టైమ్ ఉంటుందని కానీ.. దేశంలో అంతర్భాగమైన మణిపూర్‌కు వెళ్లేందుకు సమయం ఉందడని విమర్శలు కురిపించాయి. ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ సమావేశాల్లోనూ విపక్షాలు మోడీని ఈ విషయంలో టార్గెట్ చేశాయి. మోడీ ప్రసంగిస్తున్న సమయంలో మణిపూర్ అల్లర్లపై మాట్లాడాలని పట్టుబట్టాయి. ఈ క్రమంలో మణిపూర్ అల్లర్లు, ఆ రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఎట్టకేలకు ప్రధాని మోడీ నోరు విప్పారు. బుధవారం రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మణిపూర్‌లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు.

ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు. అల్లర్ల కారణంగా మణిపూర్‌లో మూతపడ్డ విద్యాసంస్థలు, ఆఫీసులు తిరిగి తెర్చుకున్నాయన్నారు. మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 11 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయని, 500 మందికి పైగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో మళ్లీ గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని మణిపూర్ ప్రజలు బహిష్కరిస్తారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో 10 సార్లు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed