బీజేపీ కంచుకోటల్లోనూ మోడీ భయపడుతున్నారు: ఇండోర్, సూరత్ వ్యవహారంపై కాంగ్రెస్

by samatah |
బీజేపీ కంచుకోటల్లోనూ మోడీ భయపడుతున్నారు: ఇండోర్, సూరత్ వ్యవహారంపై కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని సూరత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ స్పందించింది. తమ అభ్యర్థులను బీజేపీ భయభ్రాంతులకు గురి చేసిందని ఆరోపించింది. సంప్రదాయకంగా ఉన్న బీజేపీ కంచుకోటల్లోనూ ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మంగళశారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘1984 నుంచి కాంగ్రెస్ సూరత్, ఇండోర్ లోక్‌సభ స్థానాలను గెలవలేదు. అయినప్పటికీ ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరించి వారి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారు. బీజేపీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనూ మోడీ ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.

బీజేపీ వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్న ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదని వెల్లడించారు. ఈ తరుణంలో స్వేచ్చ, నిష్పాక్షికమైన పోలింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కాగా, ఇండోర్ లోక్‌సభ స్థానం అభ్యర్థి అక్షయ్ బామ్ నియోజకవర్గంలో పోలింగ్‌కు ముందు సోమవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. అంతకు ముందు సూరత్ అభ్యర్థి నామినేషన్‌ను ఈసీ తిరస్కరించగా.. అక్కడ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement

Next Story