మోడీ కేబినెట్ 3.0.. కీలక శాఖలు బీజేపీ వద్దే

by S Gopi |
మోడీ కేబినెట్ 3.0.. కీలక శాఖలు బీజేపీ వద్దే
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వం ఆదివారం ఏర్పాటైంది. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోడీ సోమవారం కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలక శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోగా, వివిధ రాష్ట్రాలు, సామాజిక సమూహాలకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రులకు శాఖలను కేటాయించారు. ప్రధాని మోడీతో సహా మొత్తం 72 మందితో కూడిన కొత్త మంత్రివర్గంలో 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. అందులో బీజేపీకి 61 మంత్రి పదవులు దక్కగా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, శివసేన, ఇతరులు 11 మంది కేంద్రమంత్రి పదవులను దక్కించుకున్నాయి.

ప్రధాని మోడీ కీలక సిబ్బంది వ్యవహారాలు, పించన్లు, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, అణు శక్తి, అంతరిక్షం, కీలక విధాన సంబంధిత అంశాలతోపాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.

వీరికి పాతవే కొనసాగింపు..

ఇక, మోడీ ప్రభుత్వంలో ఇదివరకే ఉన్న ప్రధాన హోం మంత్రిత్వ శాఖ అమిత్ షాకు, రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్‌కు, ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్‌కు, విదేశాంగ శాఖ జైశంకర్‌లకు వారి పాత శాఖలనే అప్పజెప్పారు. ఇక, నితిన్ గడ్కరీకి రోడ్లు, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, అశ్విని వైష్ణవ్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖలను కొనసాగించారు. పాతవారిలో జ్యోతిరాదిత్య సింధియాను విమానయానం నుంచి ఈశాన్య ప్రాంత అభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖకు బదిలీ చేశారు.

3.0లో చేరిన సీనియర్లు..

మోడీ మూడో టర్మ్‌లో చేరిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వ్యవసాయ, పంచాయితీరాజ్ శాఖలను అప్పగించారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ దక్కింది. మోడీ 1.0లో పనిచేసిన జేపీ నడ్డాకు ఆరోగ్య శాఖ వరించింది. మనోహర్ లాల్ ఖట్టర్‌కు గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలు, లలన్ సింగ్‌కు పంచాయతీరాజ్‌, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖలు కేటాయించారు.

తెలుగు మంత్రులకు దక్కిన శాఖలు..

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఏపీ నుంచి మిత్రపక్షం టీడీపీకి చెందిన యువ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా, చంద్రశేఖర్ పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పదవి లభించింది. బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ, బండి సంజయ్‌కు హోం సహాయ మంత్రి పదవి దక్కింది.

రాష్ట్రాలవారీగా కేటాయింపులు..

రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్​లో ఉత్తర్​ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలకు మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. యూపీకి 9, బీహార్​కు 8 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్​కు 5 చొప్పున కేంద్ర మంత్రి పదవులు లభించాయి. హర్యానా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు మూడు చొప్పున, ఒడిశా, అస్సాం, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బంగాల్, కేరళకు రెండు చొప్పున కేంద్ర మంత్రి పదవులు కేటాయించారు.

టీడీపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, జేడీయూకు చెందిన లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్, ఆర్‌ఎల్‌డీకి చెందిన జయంత్ చౌదరి, ఎల్జేపీకి చెందిన చిరాగ్ పాశ్వాన్, హెచ్‌డీ కుమారస్వామిలు బీజేపీ మిత్రపక్షాల నుంచి తొలిసారిగా ఏడుగురు మంత్రులుగా ఎన్నికయ్యారు.

ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఎవరికి ఏయే శాఖలంటే..

మోడీ 3.0 ప్రభుత్వం ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 11 మందికి మంత్రి పదవులు ఇచ్చింది. వీరిలో ఐదుగురు కేబినెట్ మంత్రులు లభించాయి. ప్రధానంగా అత్యంత పిన్నవయసు కేంద్రమంత్రిగా చర్చలో ఉన్న టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పౌర విమానయాన శాఖ లభించింది. అలాగే, టీడీపీకే చెందిన చంద్రశేఖర్ పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది.

జేడీయూ నుంచి రాజీవ్ రంజన్‌కు పంచాయతీరాజ్ శాఖ, రామ్ నాథ్ ఠాకూర్‌కు వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయ మంత్రి పదవి లభించింది.

కర్ణాటక జేడీ(ఎస్) నుంచి హెచ్ డి కుమారస్వామికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ దక్కింది.

బీహార్ నుంచి ఎల్జేపీకి చెందిన చిరాగ్ పాశ్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ లభించింది.

బీహార్ నుంచి హిందూస్తానీ అవాం మోర్చా(సెక్యులర్) వ్యవస్థాపకుడు జితన్ రామ్ మాంఝీకి కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కేటాయించారు.

యూపీ నుంచి రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) ఉపాధ్యక్షుడు జయంత్ చౌదరికి స్వతంత్ర బాధ్యతలు కలిగిన స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయ మంత్రి పదవి.

యూపీ నుంచి అప్నా దళ్(సోనీలాల్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి పదవి.

మహారాష్ట్ర నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) అధ్యక్షుడు రాందాస్ అథవాలేకు సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి పదవి.

మహారాష్ట్ర నుంచే శివసేన ఎంపీ ప్రతాపరావు జాదవ్‌కు స్వతంత్ర బాధ్యతల కింద ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి పదవి.

Advertisement

Next Story