MK Stalin : దక్షిణాది దన్నుతోనే ఉత్తరాది ఎదుగుతోంది : సీఎం స్టాలిన్

by Hajipasha |
MK Stalin : దక్షిణాది దన్నుతోనే ఉత్తరాది ఎదుగుతోంది : సీఎం స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో : దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధితో సృష్టిస్తున్న సంపద వల్లే ఉత్తరాది రాష్ట్రాలు(North India) నెగ్గుకు రాగలుగుతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్(MK Stalin) అన్నారు. ఇదే నిజమని.. దీన్ని ఎవరూ కాదనలేరని ఆయన పేర్కొన్నారు. ‘‘దేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తమిళనాడు. ఇది ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. దక్షిణాదిలోని రాష్ట్రాలు ఆర్థికంగా శరవేగంగా పురోగతిని సాధిస్తున్నాయి. దీని ఫలితంగానే ఉత్తరాది రాష్ట్రాలకు పుష్కలంగా నిధులు లభిస్తున్నాయి. అవి కూడా ఎదుగుతున్నాయి’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

‘‘ఉత్తరాది పురోగతిలో ఉంది.. దక్షిణాది అధోగతిలో ఉందని ఆనాడు డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై చెప్పారు. కానీ నేడు పరిస్థితి మారింది. దక్షిణాది(South India) మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఉత్తరాదికి అండగా నిలిచే పెన్నిధిగా దక్షిణాది తయారైంది’’ అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని కొంగు బెల్ట్ ప్రాంతంలో పర్యటన సందర్భంగా సీఎం స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘తమిళనాడులోని ద్రవిడ పాలనా పద్ధతి ప్రజల మనసులను గెల్చుకుంది. ఐక్యరాజ్యసమితి ప్రమాణాలకు అనుగుణంగా మా పాలన సాగుతోంది’’ అని ఆయన చెప్పారు. ‘‘గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటితో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో డీఎంకే పాపులారిటీ చాలా పెరిగింది. 2026లో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే విజయం తథ్యం’’ అని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story