MiG-29: కుప్పకూలిన మిగ్-29 విమానం.. ఇద్దరు పైలట్లు సేఫ్

by vinod kumar |
MiG-29: కుప్పకూలిన మిగ్-29 విమానం.. ఇద్దరు పైలట్లు సేఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAAF)కు చెందిన మిగ్-29(Mig-29) యుద్ధ విమానం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా(Agra) సమీపంలో సోమవారం కుప్ప కూలింది. సాధారణ వ్యాయామంలో భాగంగా పంజాబ్‌లోని అడంపూర్(Adampur) నుంచి బయలుదేరిన విమానం ఆగ్రాకు వెళ్తుండగా.. సోంగా గ్రామం(songa village)లోని ఖాళీ స్థలంలో పడిపోయినట్టు ఐఏఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక కారణాలవల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంది. విమానం నేలపై పడిపోయిన అనంతరం భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉండగా.. మంటలు రావడానికి కొద్ది సెకన్ల ముందు వారిద్దరూ పారాచూట్ సహాయంతో విమానం నుంచి దూకారు. దీంతో వారిద్దరూ క్షేమంగా బయటపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఐఏఎఫ్ అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన పైలట్ అప్రమత్తమై విమానాన్ని మైదానంలో దింపాడని, జనావాస ప్రాంతంలో కూలిపోయి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని పలువురు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది జూన్ 4న కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సుఖోయ్-30 మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కుప్పకూలింది.

Advertisement

Next Story