ఆ హామీ ఇస్తే.. ఎన్నికల నుంచి తప్పుకుంటా : సజ్జాద్ లోన్

by Hajipasha |
ఆ హామీ ఇస్తే.. ఎన్నికల నుంచి తప్పుకుంటా : సజ్జాద్ లోన్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో తమ పార్టీ సవాలు చేయడం పొరపాటు కావొచ్చు కానీ.. అలా చేసి ఉండకపోతే కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేదని పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజ్జాద్ లోన్ అన్నారు. బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370పై ప్రజలకు బూటకపు హామీలు ఇవ్వడాన్ని, వారిని ఫూల్ చేయడాన్ని ఇక ఆపేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి సజ్జాద్ హితవు పలికారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని కచ్చితమైన హామీ ఇస్తే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. ఆ విధమైన హామీ దొరికిన వెంటనే వెళ్లి నామినేషన్ పేపర్లను వెనక్కి తెచ్చుకుంటానని వెల్లడించారు. 2019 ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన రోజున.. దేశ పార్లమెంటు ప్రాముఖ్యాన్ని తాను అర్థం చేసుకున్నట్లు సజ్జాద్ చెప్పారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్న సజ్జాద్.. తనను గెలిపిస్తే పార్లమెంటులో కశ్మీరీల గొంతును తప్పక వినిపిస్తానని తెలిపారు.

Advertisement

Next Story