బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు

by Harish |   ( Updated:2024-07-10 09:07:40.0  )
బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై పాతాల్గంగా లాంగ్సీ టన్నెల్ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణాలను కొద్ది గంటల పాటు నిలిపేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు శిథిలాలు తొలగించే పనిలో ఉన్నారు. కొండచరియలు విరిగిపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పాటు, పెద్ద సంఖ్యలో రోడ్లను మూసివేశారు. చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు నీటితో నిండిపోయాయి. జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ వద్ద అలకనంద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఉత్తరాఖండ్ నదులు చాలా వరకు ఉప్పొంగుతున్నాయి. శనివారం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో మరికొద్ది రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Advertisement

Next Story